మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లో కూడా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో యశ్ రాయ, టికెట్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇందులో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో పాటు సోదరీ సోదరుల మధ్య అనుబంధం కూడా ప్రధానంగా ఉంటుందని సమాచారం. యశ్ సోదరి గంగ పాత్ర కోసం మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను మేకర్స్ ఎంపిక చేశారు. కరీనా కూడా తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత కరీనా కపూర్ ఈ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా తప్పుకున్నారు. యశ్ వంటి స్టార్ హీరోకు సోదరిగా నటించడం తనకు ఇష్టం లేదని, ఒకవేళ అవకాశం వస్తే హీరోయిన్‌గా మాత్రమే నటిస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ పాత్ర కోసం వేరే నటిని వెతకాల్సి వచ్చింది.

కరీనా తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం నయనతారను సంప్రదించారు. మొదట నయనతార కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గంగ పాత్రకున్న ప్రాముఖ్యతను, అందులోని తీవ్రతను వివరించడంతో ఆమె నటించేందుకు అంగీకరించారు.

ఈ సినిమాలో నయనతారతో పాటు హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు, రికార్డుల గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే చర్చ మొదలైంది.