హైదరాబాద్ పోలీసుల హెచ్-ఫాస్ట్ బృందం వంద రోజుల్లో నగరంలో ఆహార కల్తీపై 185 కేసులు నమోదు చేసి, 121.87 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. ఈ బృందం మార్చి 19న కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాలతో ఏర్పాటైంది. ఇప్పటివరకు రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు, గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, ఖైరతాబాద్‌లో 5 కేసులు నమోదైనట్లు సజ్జనార్ తెలిపారు.
పసిపిల్లలకు ఇచ్చే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, టీ పొడి, పాలు, పెరుగు వంటి వస్తువులు అన్నీ కల్తీ కావడం పోలీసులు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వెల్లుల్లి పొట్టు, సింథటిక్ రంగులు, ఎసిటిక్ యాసిడ్, ప్రమాదకరమైన శాంటిక్‌లు కలుపుతున్నారు. కుళ్లిపోయిన చికెన్, మటన్‌లను రసాయనాలతో కడిగి తాజాగా చూపుతున్నారు.
నెయ్యిగా పామాయిల్, ఇతర చౌక నూనెలను వాడుతున్నారు. చెక్కపొట్టు టీ పొడిని సామాన్యులకు అమ్ముతున్నారు. గడువు ముగిసిన డ్రై ఫ్రూట్స్, సమోసాలు, పేణీల్లో విషపూరిత రసాయనాలు వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రతి ఒక్క వస్తువు కల్తీ కావడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందని సజ్జనార్ హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు 247 కేసులను అప్పగించారు. ప్రజలు బ్రాండెడ్ వస్తువుల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల ఈ మాఫియా పెరుగుతోందని సజ్జనార్ అన్నారు. ప్రతి పౌరుడు కల్తీ మాఫియాకు వ్యతిరేకంగా సహకరించాలని పోలీసులు కోరారు.








