బస్ స్టాండ్‌కు వెళ్లేందుకు వేరే ఆటో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఆర్టీసీ టికెట్‌తో పాటే ఎలక్ట్రిక్ ఆటోను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పించనుంది. హైదరాబాద్‌ సిటీ పరిధిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుండగా, ఇంటి నుంచి బస్సు ఆగే పాయింట్‌ వరకు, అలాగే బస్సు దిగిన తర్వాత ఇంటి వరకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకుని, ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ 'కాంబో' సర్వీసును ప్రారంభిస్తోంది. దీనికోసం ఎలక్ట్రిక్ ఆటోలతో కూడిన యాప్ ఆధారిత అగ్రిగేటర్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న యాప్ ద్వారా ప్రయాణికులు బస్ టికెట్‌తో పాటు ఆటోను కూడా బుక్ చేసుకుని, మొత్తం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు బస్సు దిగగానే, నిర్ధారిత సమయానికి ఆటో సిద్ధంగా ఉండి గమ్యం చేర్చనుంది. బస్ టికెట్ ధర, ఆటో రుసుము రెండూ ఆర్టీసీకి చేరగా, ఆటో చార్జీని సంబంధిత అగ్రిగేటర్‌కు ఆర్టీసీ పంపుతుంది. ప్రస్తుతం అగ్రిగేటర్లు కృత్రిమ మేధ ఆధారంగా చార్జీలు మారుస్తుండగా, ఆర్టీసీ ఒప్పందం మాత్రం రవాణా శాఖ నిర్ధారించిన చార్జీలకే జరగనుంది.

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెట్రో టికెట్లు పంపే ప్రైవేటు విధానాలు ఉన్నప్పటికీ, ఆటో సర్వీసును ఎంగేజ్ చేసే కాంబో విధానాన్ని అవలంబిస్తున్న తొలి సంస్థగా తెలంగాణ ఆర్టీసీ నిలువనుంది. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఈ ఏర్పాటు చేస్తుండగా, అగ్రిగేటర్ కూడా రవాణా శాఖ చార్జీలకే సేవలు అందించడానికి అంగీకరించింది.