చిన్నంబావి, ఆంధ్రప్రభ: అభివృద్ధి విషయంలో తనను విమర్శిస్తున్న వాట్సాప్ వేదికల వారిని ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను ఆకాశం నుంచి ఊడిపడలేదని, ఈ ప్రాంతంలో పుట్టి ప్రజల మధ్యే రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని అన్నారు. సోమవారం చిన్నంబావి మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ.330 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖ ద్వారా కేటాయించిన నిధులతో పాటు అదనంగా మరో రూ.200 కోట్లు అభివృద్ధి పనులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా డబుల్ రోడ్ల నిర్మాణాలకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంపై వాట్సాప్ ద్వారా చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందని మంత్రి అన్నారు. తాను పెద్దదగడ గ్రామంలో పుట్టి, ఇక్కడే చదువుకుని, ఉద్యోగం చేసి, రాజకీయాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. ఉద్యోగం చేసిన సమయంలోనే రైతుల కోసం దాదాపు 100 బావులను ఉచితంగా తవ్వించానని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రైతులకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేశానని తెలిపారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రైతుల సమస్యలపై పోరాడానని గుర్తు చేశారు. అప్పట్లో రైతుల నుంచి విద్యుత్ పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌తో కలిసి ఉచిత విద్యుత్ కోసం ఉద్యమించానని, ఆ సమయంలో అరెస్టు కూడా అయ్యానని తెలిపారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సాధించేందుకు ప్రభుత్వంపై పోరాటం చేశానని మంత్రి జూపల్లి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. కేఎల్‌ఐ ద్వారా రైతులకు సమగ్రంగా సాగునీరు అందించేలా రూపకల్పన చేయించామని, జూరాల ప్రాజెక్టు రాకముందే చిన్నమారూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మూతపడిన ప్రాజెక్టుకు తన సొంత ఖర్చుతో రూ.3 లక్షలు వెచ్చించి మోటార్లు ప్రారంభించినట్లు వివరించారు.
గతంలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ అమలు జరిగిందని, అందులో తాను కూడా భాగస్వామినని తెలిపారు. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్‌దిన్నె రిజర్వాయర్ వరకు ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా, తర్వాత వచ్చిన నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి రూ.3 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిన్నంబావి మండల అభివృద్ధికి మంత్రి జూపల్లి తన సొంత భూమిలో ఆరు ఎకరాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా పాలనలో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.








