ప్రముఖ పేమెంట్ టెక్నాలజీ సంస్థ విసా, తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాల నుంచి 7% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ప్రస్తుతం విసా సంస్థలో సుమారు 34,100 మంది పనిచేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8% అధికం కావడం గమనార్హం.
ఈ తొలగింపులు ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయనే చర్చ మొదలైంది. పనితీరు ఆధారంగా కాకుండా, సంస్థ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగానే ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.
సంస్థ తన పనులను మరింత సులభతరం చేయడంతో పాటు, అధిక వృద్ధిని నమోదు చేసే ప్రాంతాలకు వనరులను మళ్లించేందుకు ఈ మార్పులు చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల సంస్థ భవిష్యత్తు వృద్ధి రేటు ఏ విధంగా ప్రభావితం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








