అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్‌షిప్స్ 2026లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ మెరిశాడు. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో 74.09 మీటర్ల దూరాన్ని నమోదు చేసి ఆశిష్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో 2016లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన పదేళ్ల తర్వాత, ఈ విభాగంలో పతకం గెలిచిన రెండో భారతీయ అథ్లెట్‌గా ఆశిష్ నిలిచాడు.
ఫైనల్ పోటీలో ఆశిష్ తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మొదటి ప్రయత్నంలో 69.96 మీటర్లు విసిరిన ఆశిష్, రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా 72.31, 70.62, 67.98 మీటర్ల దూరాలను నమోదు చేశాడు. ఈ పోటీల్లో దక్షిణాఫ్రికాకు చెందిన జాన్-హెండ్రిక్ హేమన్స్ 80.50 మీటర్లతో స్వర్ణాన్ని, డొమినికాకు చెందిన అడిసన్ జేమ్స్ 73.89 మీటర్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.
భారత్ నుంచి ఈ ఫైనల్‌లో పాల్గొన్న మరో అథ్లెట్ టి. ధరణీధరన్ 72.35 మీటర్ల అత్యుత్తమ త్రోతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వాలిఫికేషన్ దశలో ఆశిష్ 69.87 మీటర్లతో రెండో స్థానంలో, ధరణీధరన్ 68.07 మీటర్లతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్తులు దక్కించుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్స్‌లో 147 దేశాల నుంచి 1,800 మందికి పైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. భారత్ నుంచి మొత్తం 36 మంది అథ్లెట్ల బృందం ఈ అంతర్జాతీయ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.






