తెలుగు నటి ట్విషా శర్మ మరణం కేసులో నిందితురాలైన గిరిబాలా సింగ్ న్యాయస్థానంలో విచిత్రమైన కోరికలు వినిపించారు. జైలు అధికారులు తమకు హిందీ, ఆంగ్ల వార్తాపత్రికలు ఇస్తున్నా, ట్విషా మరణానికి సంబంధించిన వార్తలున్న భాగాలను కత్తిరించి మాత్రమే అందిస్తున్నారని ఆమె ఆరోపించారు. కటింగ్‌లు కాకుండా పూర్తి వార్తాపత్రిక తనకు ఇవ్వాలని, అలాగే తన కుమారుడు సమర్థ్ సింగ్‌తో పాటు న్యాయవాదులను కలిసేందుకు ప్రస్తుతం ఉన్న 20 నిమిషాల సమయాన్ని పెంచాలని కోర్టును అభ్యర్థించారు.

పోలీసులు ట్విషా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మందుల జాబితాను తమకు అందించలేదని గిరిబాలా సింగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాంగ్మూలాన్ని అంగీకరించిన న్యాయస్థానం, ఆ మందుల మెమోను వెంటనే నిందితురాలి న్యాయవాదులకు ఇవ్వాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. కాగా, మే 12న గిరిబాలా సింగ్ ఇంట్లో ట్విషా శర్మ మృతి చెందగా, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ ఘటనపై బాధిత కుటుంబం హత్య ఆరోపణలు చేసింది. భోపాల్ ఎయిమ్స్ పోస్ట్‌మార్టంపై అనుమానాలు రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించగా, మరణానికి ముందు గాయాలు అయినట్లు, ట్విషా పెనుగులాడినట్లు తేలడంతో సీబీఐ దర్యాప్తును తీవ్రతరం చేసింది.