పశ్చిమబెంగాల్ దినోత్సవం సందర్భంగా హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో శనివారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. గత ప్రభుత్వాల పరిపాలనలో బంధించబడిన బెంగాల్, ఇప్పుడు ఆ సంకెళ్ల నుంచి బయటపడిందని ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తోందని వెల్లడించారు.

దేశ విభజన తరువాత బెంగాల్‌ను భారత్ నుంచి వేరు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన యత్నాలు విఫలమయ్యాయని మోడీ గుర్తుచేశారు. అలాగే రక్తపాతాన్ని, ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నా బెంగాల్ ప్రజలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని, ఒకే ఎన్నికల ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని అన్నారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి కావాల్సిన భూమిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం కేటాయించలేదని ప్రధాని విమర్శించారు. ఓటుబ్యాంకు కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించారని మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం సరిహద్దు కంచె నిర్మాణానికి భూమిని కేటాయించిందని తెలిపారు.