తమిళనాడులోని తూత్తుకూడి తీరంలో ఆదివారం భారీ ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సుగిర్థన్ అనే వ్యక్తి మరో ఆరుగురు మత్స్యకారులతో కలిసి రెండ్రోజుల క్రితం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారి బలమైన గాలులు వీయడంతో వారి పడవ ప్రమాదానికి గురైంది.
పడవ మునిగిపోతుందని ముందే గుర్తించిన మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. సమీపంలోని ట్రావెలర్ పడవను వారు గట్టిగా పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. అదే సమయంలో అటుగా చేపల వేటకు వచ్చిన మరో బోటు సిబ్బంది వీరిని గమనించారు.
వెంటనే స్పందించిన ఆ సిబ్బంది, సముద్రంలో ఉన్న ఏడుగురు మత్స్యకారులను తమ పడవలోకి ఎక్కించుకున్నారు. దీంతో మత్స్యకారులకు ప్రాణాపాయం తప్పింది.








