పాతకాలపు కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించే హాబీ ఉన్నవారు అరుదైన నోట్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ ఫొటో ముద్రించి ఉన్న రూ.5 నోటుకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇలాంటి నోట్లు ఉన్నవారు ఆన్‌లైన్ వేదికల ద్వారా వీటిని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు.
ట్రాక్టర్ ఫొటోతో పాటు 123 లేదా 786 వంటి ప్రత్యేక సీరియల్ నంబర్లు ఉన్న నోట్లకు మరింత ఆదరణ ఉంది. కొన్ని మతాల్లో ఈ అంకెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. కొనుగోలుదారులు ఇలాంటి నోట్లను సొంతం చేసుకునేందుకు రెట్టింపు ధర చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు.
ఇలాంటి నోట్లను విక్రయించాలనుకునే వారు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వాటి ఫొటోలను, సీరియల్ నంబర్లను, ధర వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నేరుగా సంప్రదిస్తారు. కొన్ని సందర్భాల్లో అరుదైన నోట్ల కోసం ప్రత్యేకంగా వేలం పాటలు కూడా నిర్వహిస్తుంటారు.
అయితే, ఆన్‌లైన్‌లో కరెన్సీ నోట్లను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు నకిలీ నోట్లను చూపి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి, లావాదేవీలు జరిపే ముందు విక్రయదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవడం అవసరం.
కొనుగోలు చేసే ముందు నోట్ల ఫొటోలు స్పష్టంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఆన్‌లైన్ వేదికలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.








