Toxic | రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది సేపటికే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమాకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం ‘టాక్సిక్’ సినిమా టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెంచిన టికెట్ ధరల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.

‘టాక్సిక్’ విడుదల రోజున అభిమానుల కోసం ప్రత్యేకంగా ఉదయం 6 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షోల టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘టాక్సిక్’ భారీ విడుదల ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ కి పెద్ద సవాలుగా మారనుంది. ప్రస్తుతం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన జోరుతో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటేసి రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

కానీ ‘టాక్సిక్’ కోసం పెద్ద ఎత్తున థియేటర్లను కేటాయిస్తే ‘ఇరుముడి’ షోలు, స్క్రీన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీంతో బలమైన వసూళ్లను నమోదు చేస్తున్న సమయంలోనే రవితేజ సినిమాకు స్క్రీన్ కౌంట్ తగ్గడం పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.అయితే ఈ రెండు సినిమాల భవిష్యత్‌పై ‘టాక్సిక్’కు వచ్చే ప్రేక్షకాదరణ కీలకంగా మారనుంది. ఒకవేళ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, రాబోయే రోజుల్లో కూడా అధిక సంఖ్యలో థియేటర్లు ‘టాక్సిక్’కే దక్కే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ‘ఇరుముడి’ థియేట్రికల్ రన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ‘టాక్సిక్’కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతే పరిస్థితి మారే అవకాశమూ ఉంది. మొదటి రోజు టాక్, కలెక్షన్లను బట్టి ఎగ్జిబిటర్లు మళ్లీ బలమైన డిమాండ్ ఉన్న ‘ఇరుముడి’కి అదనపు షోలు కేటాయించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.