ఉపాధ్యాయులుగా పనిచేయడానికి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనతో వేలాది మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని RUPP TS ఆవేదన వ్యక్తం చేసింది. 2010 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు, గౌరవాధ్యక్షుడు ఎంఎన్ విజయ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరిని కలిసింది. సుమారు 21 వేల మంది టీచర్లకు ఉపశమనం కల్పించాలని వారు మంత్రిని కోరారు.
ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. టీచర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు.
అంతేకాదు, ప్రస్తుతం ఉన్న టెట్ పేపర్-2 విధానం అశాస్త్రీయంగా ఉందని సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. ఈ పేపర్‌లో తగిన మార్పులు చేయాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు.







