తైవాన్ నటుడు, మోడల్ మరియు మ్యూజీషియన్ చెంగ్ చాంగ్ ఫాన్, ఒక భారతీయ యువతితో ఉన్న వీడియోలు, ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. 2025లో చెంగ్ ఇండియాకు వచ్చినప్పుడు ఒక హోటల్‌లో తీసిన పాత రీల్ (చిన్న వీడియో) ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఆ వీడియోలో హోటల్ సిబ్బంది అయిన ఒక యువతి, చెంగ్‌కు హారతి ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికింది. ఆ సమయంలో చెంగ్ ఆమె వైపు చూసిన తీరును గమనించిన నెటిజన్లు, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందని, వారు ప్రేమలో ఉన్నారని ఊహించుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ జంటను మాజీ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోని, సాక్షిల ప్రేమకథతో కూడా కొందరు పోల్చుతున్నారు.

ఈ ప్రచారానికి ప్రధాన కారణం చెంగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటోల గ్యాలరీ. అందులో భారతీయ మహిళల ఆప్యాయత, భావోద్వేగాలను పంచుకునే తీరు తనకు ఎంతో నచ్చాయని చెంగ్ రాసుకొచ్చారు. ఇండియాలో అడుగుపెట్టినప్పుడు హోటల్‌లో కలిసిన ఆ యువతిని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆసక్తిని మరింత పెంచాయి.

అయితే, ఆ యువతి తన గర్ల్‌ఫ్రెండ్ అని చెంగ్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అటు ఆ యువతి కూడా దీనిపై ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. కాబట్టి ఈ కథ ప్రస్తుతానికి కేవలం ఒక రూమర్‌గా మాత్రమే మిగిలిపోయింది.

మరోవైపు, ఈ వైరల్ వీడియోల వెనుక భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. చెంగ్ ఓపెన్‌గా గే (పురుషుల పట్ల ఆకర్షణ కలిగిన వ్యక్తి) అని, 2020లో నటించిన ‘క్రేవింగ్ ఫర్ యు’ అనే వెబ్ సిరీస్ సమయంలోనే ఆయన తన భావాలను వెల్లడించారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోలు అసలైనవా లేక ఏఐ (AI - కృత్రిమ మేధస్సుతో సృష్టించినవి) ద్వారా రూపొందించినవా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతానికి ఆ యువతి పేరు, ఆమె వివరాలు ఎవరికీ తెలియవు. నిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఒక రొమాంటిక్ కథను ఊహించుకోవడంలో నెటిజన్లు నిమగ్నమై ఉన్నారు.