స్పైడర్ మ్యాన్ సినిమా ఫ్రాంచైజీ నుంచి 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' అనే కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టామ్ హోలాండ్ హీరోగా, జెండాయా హీరోయిన్గా నటిస్తుండగా, వీరి తెలుగు ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే సూపర్ హీరోగా స్పైడర్ మ్యాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌కు ఈ సినిమా మరింత బలం చేకూర్చనుంది.

గత మూడు నెలల క్రితం విడుదలైన ట్రైలర్‌లో 'నో వే హోమ్' సంఘటనల అనంతరం పీటర్ పార్కర్ ఎవరో ప్రపంచానికి తెలియని పరిస్థితిలో న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం చూపించారు. అలాగే స్పైడర్ మ్యాన్ శరీరంలో జరిగిన జన్యు మార్పులకు కారణాలను కూడా అప్పుడు వెల్లడించారు. తాజా ట్రైలర్‌లో మాత్రం హల్క్‌తో పాటు మరికొందరితో స్పైడర్ మ్యాన్ చేసే యుద్ధాలను ప్రదర్శించారు.

ఈ చిత్రంలోని ప్రతి యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సినిమాలో జంటగా నటించిన టామ్, జెండాయా నిజ జీవితంలో కూడా వివాహ బంధంతో ఒక్కటవ్వడం గమనార్హం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.