దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో జ్యోతిక అందించిన సహకారం గురించి తాజాగా బయటపెట్టారు.

ఈ కథను మొదట విన్న వారిలో జ్యోతిక ఒకరు. సినిమా ఫస్ట్ హాఫ్ ఆమెకు బాగా నచ్చినప్పటికీ, కథలో కొన్ని కీలక మార్పులు చేయాలని ఆమె సూచించారు. తాను చాలామందికి కథ వినిపించినా, జ్యోతిక ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం స్క్రిప్ట్‌కు ఎంతో బలాన్ని ఇచ్చిందని దర్శకుడు పేర్కొన్నారు.

అయితే, జ్యోతిక సూచించిన ఆ మార్పులు ఏంటనే విషయాన్ని మాత్రం వెంకీ అట్లూరి బయటపెట్టలేదు. సినిమా విడుదలైన తర్వాతే ఆ వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. దీంతో ఆమె చేసిన సూచనలు కథలో ఎలాంటి మలుపులకు దారితీశాయనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతిక సూచనలు సినిమాకు ఎంతవరకు ప్లస్ అయ్యాయో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.