ల్యాండ్ అండ్ సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నరహరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం విస్తృత దాడులు చేసింది. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి దాటినా కొనసాగాయి. నరహరి అధికార పరిధిలోకి వచ్చే భూముల సర్వేలు, సరిహద్దు వివాదాలు, రికార్డుల సవరణలు వంటి కీలక అంశాలపై ఆయన అక్రమాలు చేశారన్న సమాచారం మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
సోదాల్లో భాగంగా నరహరి నివాసంలోని బీరువాలు, కప్‌బోర్డుల నుంచి రూ.1.54 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 500 రూపాయల నోట్ల కట్టలు భారీగా లభించాయి. అలాగే కిలోకు పైగా బంగారం, సుమారు ఎనిమిది కిలోల వెండి, భారీ విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) బయటపడ్డాయి. ఈ ఆస్తులను లెక్కించడానికి అధికారులకే చెమటలు పట్టాయని సమాచారం.
నగదు, బంగారంతో పాటు నరహరి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కూడా వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లాలో ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఐదు ఓపెన్ ప్లాట్లు, పుప్పాలగూడ, రాజేంద్రనగర్, నార్సింగి, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీల్లో ఫ్లాట్లు, భవనాలు ఆయన పేరున ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు బయటపడ్డ ఆస్తుల విలువ వంద కోట్లకు మించి ఉండొచ్చని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది.
ఇటీవల తెలంగాణలో ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, మాజీ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్, అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు, హెచ్‌ఎండా మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ, జలమండలి మాజీ జీఎం అనంతలక్ష్మి కుమార్ వంటి అధికారులపై కూడా ఇలాంటి దాడులే జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత సంపాదనకు వాడుకున్న తీరును నరహరి కేసు బహిర్గతం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగినా, అక్రమాస్తులు కూడబెట్టినా అవినీతి నిరోధక శాఖకు 9440446106 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను ఏసీబీ పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది.







