కొలంబో: శ్రీలంకతో రెండో టెస్ట్ నేపథ్యంలో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. తొలి టెస్ట్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే రెండుసార్లు ఔట్ కావడంతో గిల్ నెట్స్‌లో ఆ లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డాడు.
మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌లో శుక్రవారం ఎక్కువసేపు నెట్స్‌లో శ్రమించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ బాల్ టర్నింగ్‌కు తగినట్లుగా గిల్ తన ఆట శైలిని మార్చుకుంటున్నట్లు స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే వెల్లడించాడు.
ప్రతి ఇన్నింగ్స్‌లోనూ సహజ శైలిలోనే ఆడతాడని కాకపోతే స్పిన్ బౌలింగ్‌ను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పాడు. ఇప్పటివరకు ఆడిన 42 టెస్ట్‌ల్లో గిల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో 11సార్లు ఔట్ కావడం గమనార్హం. అయితే ఆఫ్, లెగ్ స్పిన్నర్లపై గిల్ సగటు 61గా ఉంది. అలాగే అన్ని రకాల స్పిన్నర్లపై కెరీర్ సగటు 48గా నమోదైంది.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నెట్ ప్రాక్టీస్‌కు హాజరైనా బౌలింగ్, బ్యాటింగ్ చేయలేదు. ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్.. రిషబ్ పంత్, గిల్‌కు కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండో టెస్ట్‌కు కుల్దీప్ ప్లేస్‌లో జైన్ ఆడే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. మిడిలార్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆలస్యంగా ప్రాక్టీస్‌కు వచ్చాడు. ఆదివారం నుంచి ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ మొదలుకానుంది.
రెండో టెస్ట్ కోసం లంక జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ సహన్ అరచ్చిగే, బ్యాటర్ కమిల్ మిషారాను లంక జట్టులోకి తీసుకున్నారు. రమేష్ మెండిస్, నిషాన్ ఫెర్నాండో ప్లేస్‌లో ఈ ఇద్దరు వచ్చారు. గాయపడిన దినేశ్ చండిమల్ ప్లేస్‌లో పసిందు సూరియబండార జట్టులో కొనసాగనున్నాడు.
లంక జట్టు: ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కమింద్ మెండిస్ (వైస్ కెప్టెన్), లహిరు ఉదార, కమిల్ మిషారా, పసిందు సూరియబండార, సహన్ అరచ్చిగే, సోనల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.








