ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో తమ పార్టీకి చెందిన వందలాది పోస్టులను తొలగిస్తున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని ఆ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు.

ప్రధాన ప్రతిపక్షం గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులను తొలగించాలంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద కేంద్రం లేదా కోర్టు ఆదేశాలు ఉండాలని, 'ష్రేయా సింఘాల్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.

పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) కింద నోటీసులు జారీ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ నిబంధన ప్రకారం 36 గంటల్లోగా పోస్టులను తొలగించాలని ఆదేశిస్తూ, తమ పార్టీ వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని పిటిషన్‌లో వివరించారు.

అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగుల ధర్మాసనం నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా హైకోర్టులో పరిష్కారం కోరాలని సూచించింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు వైసీపీ నిర్ణయించుకుంది.

సుప్రీంకోర్టు సూచన మేరకు, ఇకపై ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. హైకోర్టు ద్వారానే తమకు న్యాయం జరగాలని ఆ పార్టీ భావిస్తోంది.