టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ సెలబ్రిటీలందరూ విఘ్నేశ్వరుడిని తమ ఇళ్లకు ఆహ్వానించారు. షూటింగ్ పనుల నుంచి విరామం తీసుకున్న నటీనటులు, కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి పూజలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో కుమారుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు, కుమార్తెలు మరియు మనవళ్లతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, చేసే పనులు ఆటంకాలు లేకుండా నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్‌తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో పూజలు చేశారు. మరోవైపు మహేష్ బాబు, అల్లు అర్జున్ నివాసాల్లో కూడా గణపతి బప్పా మోరియా నినాదాలు మార్మోగాయి. నటి రోజా సెల్వమణి తన కుటుంబంతో కలిసి నిష్టగా పూజలు నిర్వహించగా, నటి స్నేహా కూడా పూజా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులు తమ ఇంటి వేడుకలను సోషల్ మీడియాలో చూపించారు. వీరితో పాటు అనన్య పాండే, కాజోల్, సునీల్ శెట్టి, శర్వరి, తుషార్ కపూర్ తమ ఇళ్లలో గణపతిని ప్రతిష్టించి పూజలు చేశారు.
మృణాల్ ఠాకూర్, హన్సిక, రాకుల్ ప్రీత్ సింగ్, జక్కీ భగ్నానీ, గుర్మీత్ చౌదరి, దేబినా దంపతులు కూడా భక్తిపారవశ్యంతో పండగను జరుపుకున్నారు. సెలబ్రిటీల ఈ వేడుకల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.








