చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న బంధం ఈనాటిది కాదు. ఐపిఎల్ తొలి ఎడిషన్ నుంచి ధోని ఈ ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. ఐదుసార్లు ఆ జట్టును ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే చెన్నై అభిమానులు ప్రేమగా తలా అని పిలుచుకొనే ధోని.. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే సిఎస్‌కె ఫ్రాంచైజీలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ధోని కోరుకున్నంత వాటా ఇచ్చేందుకు ఫ్రాంచైజీ సుముఖంగా లేదని తెలిపాయి. తొలుత సిఎస్‌కెలో 25 శాతం వాటా కొనుగోలు చేస్తానని ధోని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కానీ, 3 శాతం వాటానే విక్రయిస్తామని యాజమాన్యం చెప్పిందట. ఆ తర్వాత ధోని తన డిమాండ్‌ను 20 శాతానికి తగ్గించుకున్నటికీ.. సిఎస్‌కె అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.

అయితే, ధోని-సిఎస్‌కె మధ్య ఈ చర్చలన్నీ మాటపూర్వకంగానే జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి రాతపూర్వక ప్రతిపాదనలు చేయలేదని పేర్కొన్నాయి. కాగా.. ఈ పరిణామాల నేపథ్యంలో సిఎస్‌కెతో ధోని సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 2025 ఐపిఎల్ మెగా వేలానికి ముందు రూ.4 కోట్లతో ధోనిని సిఎస్‌కె రిటైన్ చేసుకుంది. అయితే, గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.