తెలంగాణలో వరి ధాన్యం సేకరణలో సుమారు రూ. 500 కోట్ల మేర అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. సుమారు 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ప్రభుత్వ నిధులను కాపాడటంతో పాటు, వ్యవసాయ కార్యకలాపాల్లో పారదర్శకతను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ మరియు కస్టమ్ మిల్లింగ్ దశల్లో పటిష్టమైన భద్రతా చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
రైతుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాంచందర్ రావు గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని, పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధ్యతను ఖరారు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.








