నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో శ్రీరాముడి పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్నారు. అమెరికాలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రణబీర్, ఈ సినిమా షూటింగ్ పురోగతిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. రామాయణం రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయిందని ఆయన తెలిపారు.

మొదటి భాగం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే, రెండో భాగం షూటింగ్‌ను కూడా నితీష్ తివారీ బృందం వేగంగా పూర్తి చేస్తోంది. ఈ చిత్రాన్ని 2026 దీపావళికి మొదటి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇతిహాసంలో ఉన్న కంటెంట్ 10 భాగాల ఫ్రాంచైజీకి సరిపోతుందని, అయితే అసలు ఇతిహాసానికి కట్టుబడి ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే ఎంపిక చేసుకున్నామని రణబీర్ వివరించారు.

ఈ భారీ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్ విజువల్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి.