ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న రామాయణ సినిమా విడుదలపై నిర్మాత నమిత్ మల్హోత్ర కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ముందుగా అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసి, ఆ తర్వాత భారత్‌లో ప్రదర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ నమిత్ మల్హోత్ర ఈ వివరాలు పంచుకున్నారు. విదేశీ మార్కెట్లలో సాధారణంగా శుక్రవారం విడుదలలు ఉంటాయని, అందువల్ల నవంబర్ 6న విదేశాల్లో సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌లో మాత్రం దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తుండగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపిస్తారు. ఆస్కార్ విజేతలు ఎ.ఆర్.రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకోగా, టి-సిరీస్ సంస్థ ఈ సినిమా సంగీత హక్కులను రూ.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.








