శర్వా హీరోగా నటిస్తున్న ‘భోగి’ సినిమా నుంచి రాఖీ పండుగ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పల్లెటూరి కుర్రాడి అవతారంలో ఉన్న శర్వా, తన తోబుట్టువులతో కలిసి తాటికాయలను పంచుతున్నట్లు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.

ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు.

1960ల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామంలో ఈ కథ సాగుతుంది. గ్రామీణ జీవనశైలి, కుటుంబ అనుబంధాలు, బలమైన భావోద్వేగాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

భారతదేశంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. తోబుట్టువుల మధ్య ప్రేమను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ తాజా పోస్టర్, సినిమాపై అంచనాలను పెంచుతోంది.