నీట్ యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన దిశ అనే యువతి తన తల్లిదండ్రులకు చెప్పకుండానే విమానంలో ఢిల్లీకి బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆమె ర్యాపిడో బైక్‌లో నేరుగా నిరసన ప్రదేశానికి చేరుకుంది.
ప్రయాణ సమయంలో భయంగా ఉన్నప్పటికీ, ధైర్యంతో ఢిల్లీకి చేరుకున్నానని దిశ పేర్కొంది. తాను క్షేమంగా ఉన్నానని, ఢిల్లీ చేరుకున్న వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించానని ఆమె తెలిపింది. తన స్నేహితుడికి మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, తన ప్రయాణ వివరాలను పంచుకుంది. దారిలో కలిసిన వారు తనకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చి సహకరించారని ఆమె వెల్లడించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో భాగంగా శాంతియుత మార్గంలోనే నిరసన కొనసాగించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించింది. పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావం తెలపాలని, నిరసనలో జరిగే ప్రతి విషయాన్ని రికార్డు చేయాలని నిర్వాహకులు కోరారు.
ప్రస్తుతం దిశ జంతర్ మంతర్ వద్ద ఇతర విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది. అనుమతి పొందిన ప్రాంతాల్లోనే నిరసనలు చేపట్టాలని, అహింసా మార్గంలోనే తమ డిమాండ్లను వినిపించాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకారులకు దిశానిర్దేశం చేసింది.






