భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ సర్ఫేజ్-టూ-ఎయిర్ మిస్సైల్ (LRSAM) 'కుశ'ను గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ క్షిపణి తొలి ఫ్లైట్ టెస్టును నిర్వహించారు.

ఈ క్షిపణి సామర్థ్యంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు (UAVలు) మరియు శత్రు క్షిపణులను వివిధ దూరాలు, ఎత్తుల్లో సమర్థంగా అడ్డుకోవడంలో కుశ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవస్థను స్వయంగా అభివృద్ధి చేసిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.

భారతదేశ మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. గరిష్టంగా 350 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ క్షిపణికి సంబంధించి వివిధ వెర్షన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.

రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఈ క్షిపణిని భారత సైన్యంలో చేర్చనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే, గగనతల రక్షణ కోసం విదేశీ దిగుమతులపై భారత్ ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.