రెబల్ స్టార్ కృష్ణం రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో తన సినీ ప్రస్థానానికి ముందున్న జీవితాన్ని, సూపర్‌స్టార్ కృష్ణతో తన అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. సినిమాల వైపు రాకముందే ఆయనకు ఫొటోగ్రఫీ అంటే అపారమైన ప్రేమ ఉండేది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఫొటోగ్రఫీకి రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. ఆ రోజుల్లో బెస్సా, లైకా, రోలీఫ్లెక్స్ వంటి ప్రసిద్ధ కెమెరాలను ఉపయోగించి, రీళ్లను స్వయంగా డెవలప్ చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకమైన కెమికల్స్ వాడి, కొన్నిసార్లు బ్యాటరీ లైట్ సహాయంతో ప్రింట్స్ తీసేంత తపన ఆయనలో ఉండేది. ఈ కెమెరాలపై ఆయనకున్న పట్టు, వాటిని వాడిన విధానం ఆయన ఫొటోగ్రఫీ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి 16 ఎంఎం పిక్చర్స్ తీయడం ప్రారంభించారు. ఒక ఫొటో స్టూడియోను కూడా స్థాపించి, చవాన్ అనే కెమెరామెన్‌తో కలిసి పనిచేశారు. తన మేనమామ, సీహెచ్‌వీపీ మూర్తి రాజు, కృష్ణం రాజును హైదరాబాద్ తీసుకువచ్చి ఈ స్టూడియో ఏర్పాటుకు సహాయం చేశారు. కృష్ణం రాజు తీసిన ఫొటోలు చూసి, తన మేనమామ “అబ్బాయి, భలే ఉన్నావు రా! సినిమా హీరోలా ఉన్నావే” అని ప్రశంసించారు. అయితే, ఆ సమయంలో కృష్ణం రాజుకు నటన పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమాలు తీయడం, నాటకాలకు పబ్లిసిటీ చేయడం వంటివాటిపైనే ఆయన దృష్టి ఉండేది.

సినిమా తీయాలనే లక్ష్యంతో ఆయన చెన్నై వెళ్లినా, ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ కృష్ణ పేరు మార్మోగుతోందని తెలిసి, “నన్ను హీరోగా చూడకుండా ఎలా వదిలేశారు” అని ఒక పట్టుదల పుట్టిందని కృష్ణం రాజు తెలిపారు. తిరిగి 1963-64లో చెన్నైకి వెళ్లారు. 1965లో ప్రత్యాగాత్మ గారు ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు సినిమాకు ఆర్టిస్టుల ఇంటర్వ్యూ గురించి చెప్పారు. కృష్ణం రాజు మొదట వెళ్ళడానికి సంశయించినప్పటికీ, ప్రత్యాగాత్మ గారు, కెమెరామెన్ ఎం.కె.రాజు గారు బలవంతం చేయడంతో స్క్రీన్ టెస్ట్‌కి వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న విశ్వనాథ్ గారు ఇచ్చిన డైలాగ్‌లను చెప్పేటప్పుడు, భావోద్వేగంతో కృష్ణం రాజు కళ్ళలో నీళ్లు రావడం చూసి సుబ్బారావు , విశ్వనాథ్ ఆయనను ఎంతగానో మెచ్చుకున్నారు.

ఆ తర్వాత ప్రత్యాగాత్మ గారి సూచనతో పరివర్తన అనే నాటకాన్ని వేయడానికి రిహార్సల్స్ చేశారు. ఈ నాటకానికి ఆదుర్తి సుబ్బారావు గారిని ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు, కృష్ణం రాజును చూసి సూపర్‌స్టార్ కృష్ణ కోప్పడ్డారట. అప్పటికే కృష్ణ, జయలలిత, హేమమాలిని వంటి వారు తేనె మనసులు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. తామిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని, కలిసే తిరిగేవాళ్ళమని, తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్లినందుకు కృష్ణ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కృష్ణం రాజు వివరించారు. తన నాటకానికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు కూడా కృష్ణ మొదట కోపంగా చూసినా, కృష్ణం రాజు తన ఉద్దేశ్యాన్ని చెప్పగానే ప్రశాంతంగా విన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.