ఆగస్ట్ 24 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులను మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పరిమితి దాటిన తర్వాత టెలికాం కంపెనీలు కొత్తగా సిమ్ కార్డులను జారీ చేయవు. మొబైల్ కనెక్షన్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, తమ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ప్రజలు సులువుగా తెలుసుకునేలా చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి, అయితే జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పరిమితి తక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని వినియోగదారులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డులను మాత్రమే కలిగి ఉండవచ్చు. ఇప్పటికే తొమ్మిది సిమ్ కార్డులు ఉన్నవారు కొత్తగా కనెక్షన్లు పొందడం కుదరదు.

మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంచార్ సౌథీ యాప్ లేదా పోర్టల్ ఉపయోగపడుతుంది. అందులో ‘Know Mobile Connections in Your Name’ అనే ఆప్షన్ ఎంచుకుని, మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP - ఫోన్‌కు వచ్చే రహస్య సంఖ్య) నమోదు చేయాలి. దీని ద్వారా మీ పేరుపై ఉన్న అన్ని మొబైల్ నెంబర్ల వివరాలు కనిపిస్తాయి.

ఒకవేళ మీకు తెలియకుండా మీ పేరుపై ఏదైనా సిమ్ కార్డు ఉంటే, సదరు నెంబర్ పక్కన ఉన్న చెక్‌బాక్స్‌ను ఎంచుకుని ఫిర్యాదు చేయవచ్చు. రిపోర్ట్ బటన్‌పై క్లిక్ చేసి సమర్పించిన తర్వాత, అధికారులు ఆ నెంబర్‌ను పరిశీలిస్తారు. మీ పేరుపై లేని సిమ్ కార్డులను వారు తొలగిస్తారు, దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.