కేరళంకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో భారత్‌లోని ప్రతిష్ఠాత్మక అందాల పోటీల్లో ఒకటైన ‘మిస్ యూనివర్స్ ఇండియా-2026’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. జైపూర్‌లో ఆదివారంనాడు జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. దీంతో నవంబర్‌లో వ్యూర్టోరికోలో జరుగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కు కజియా ప్రాతినిధ్యం వహించనుంది. కేరళంలోని మావిలిక్కార ప్రాంతంలో 2007లో జన్మించిన కాజియా యూఏఈలోని అబుధాబిలోనే పెరిగింది. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యాయవిద్యను అభిసిస్తూనే మోడల్‌గా కొనసాగుతోంది. 12 ఏళ్ల పాటు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది.

గాయనిగా, సంగీతకారిణిగా కూడా పేరు తెచ్చుకుంది. లైవ్ స్పీచ్‌లు ఇస్తుంది. మలయాళ చిత్రం ‘షైలాక్’తో తెరంగేట్రం కూడా చేసింది. మిస్ యూనివర్స్ ఇండియా-2026 కిరీటం గెలుచుకోవడానికి ముందు కజియా పలు అందాల్లో పోటీల్లో విజయం సాధించింది. 17 ఏళ్ల వయస్సులో మిస్ టీన్ దివా 2024 టైటిల్ గెలుచుకుంది. మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025లో భారత్ తరఫున పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో మిస్ యూనివర్స్ కేరల-2026 టైటిల్ గెలుచుకుని చిన్న వయస్సులోనే ఆ రాష్ట్ర టైటిల్‌ను సాధించిన ఘనత సాధించింది.