కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ముందు రేవంత్ రెడ్డి సర్కారు మోకరిల్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత కరెంట్‌ను ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈమేరకు సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. అనంతరం పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ఎక్స్ పో 2026ను సందర్శించి అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచిత కరెంట్‌ను దూరం చేయడంతో పాటు లాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకంలో భాగంగానే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం రేవంత్ సర్కారు చేసిందన్నారు. అదానీకి లాభం చేయడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెడుతుంటే రేవంత్ సర్కారు దానికి వంత పాడుతోందని విమర్శించారు. దీనిపై ప్రజల మైండ్ వాష్ చేసేందుకే పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఇప్పుడున్న మీటర్లతోనే కరెంట్ సరఫరా చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుందని.. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.