కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, తప్పుడు ప్రచారాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కి ఈమెయిల్ ద్వారా తన అభిప్రాయాలను తీర్థల లక్ష్మీనరసింహ గుప్తా తెలియజేశారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ మెల్‌బోర్న్‌లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాలను బయటపెట్టేందుకు లక్ష్మీనరసింహ గుప్తా చేసిన ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అవినీతి, అరాచక పాలనను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను, నిరాధార ఆరోపణలను ప్రజల ముందు ఉంచడమే తన ప్రధాన లక్ష్యమని లక్ష్మీనరసింహ గుప్తా తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత సంస్థలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ, తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.
రానున్న ఎన్నికల వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని నాగేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సాయిరామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యారావు కాచారపు, ఉమాపతి రావు, శ్రవణ్ గుప్తా, సాయి తదితరులు పాల్గొన్నారు.








