Zomato యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి, డెలివరీ సమయంలో నగదు చెల్లించే పద్ధతిని ఎంచుకుంటే ఇకపై అదనపు భారం పడనుంది. ఈ కొత్త ఛార్జీని కంపెనీ 'పే ఆన్ డెలివరీ ఫీజు'గా బిల్లులో చూపిస్తోంది. ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వారికి ఈ అదనపు రుసుము ఉండదు.
కొందరు వినియోగదారుల బిల్లుల్లో ఈ ఫీజు రూ. 5గా కనిపిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో రూ. 7 నుంచి రూ. 20 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఫుడ్ ఆర్డర్, డెలివరీ ఛార్జీలతో కలిపి బిల్లులోనే ముందుగా చేరుస్తున్నారు.
Zomato రోజుకు సుమారు 23 నుంచి 25 లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. ప్రతి ఆర్డర్‌పై ఈ ఫీజు వసూలు చేయడం ద్వారా కంపెనీకి రోజువారీగా కోట్లలో అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టిన సంస్థ, ఈ ఏడాది వాటిని ఒక్కో ఆర్డర్‌కు రూ. 14.99 వరకు పెంచింది.
ప్రస్తుతానికి ప్రత్యర్థి సంస్థ అయిన Swiggy, క్యాష్ ఆన్ డెలివరీపై ఎలాంటి అదనపు ఫీజులను విధించడం లేదు. అయితే, చిన్న చిన్న ఛార్జీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం ఫుడ్ డెలివరీ సంస్థలకు ఒక వ్యూహంగా మారుతోంది.
ఈ కొత్త ఛార్జీల వల్ల ఫుడ్ ధరతో పాటు డెలివరీ, ప్లాట్‌ఫామ్, ప్యాకింగ్, ట్యాక్స్ వంటి ఖర్చులు అన్నీ కలిసి బిల్లు మొత్తం పెరుగుతోందని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇతర డెలివరీ కంపెనీలు కూడా ఇలాంటి ఛార్జీలను అమలు చేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు.







