ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సమక్షంలో తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు సీనియర్ నాయకులతో సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు, తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ, తెలంగాణలో మాత్రం తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన తెలిపారు.
పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని రామచందర్ రావు కొట్టిపారేశారు. నాయకుల మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని, కానీ పార్టీలో ఎటువంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో పాత, కొత్త నాయకులు అనే తేడాలు లేవని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై పోరాటం చేయాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసిందని రామచందర్ రావు తెలిపారు. 937 మండలాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, సరైన సమయం కోసం వారు వేచి చూస్తున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు రామచందర్ రావు వెల్లడించారు.








