జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ వాసులు వినాయక చవితి వేడుకల్లో భాగంగా పసుపు కొమ్ములతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 40 కిలోల పసుపు కొమ్ములతో పాటు మైదాపిండి, గోనె సంచులను ఉపయోగించి ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

హిందూ సంప్రదాయంలో పసుపును పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. ఈ నమ్మకంతోనే పవిత్రమైన పసుపును గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ వినూత్న ప్రయత్నం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గత 15 ఏళ్లుగా వీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు దూరంగా ఉంటూ పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

కేవలం విగ్రహమే కాకుండా, గణపతి మండపాన్ని కూడా ప్రకృతికి అనుకూలంగానే తీర్చిదిద్దారు. ప్లాస్టిక్ వంటి కాలుష్యకారక పదార్థాలను వాడకుండా, వెదురు తడకలతో పందిరిని ఏర్పాటు చేశారు.

విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా సహజ సిద్ధమైన వస్తువులతోనే జరగనుంది. దీనివల్ల నిమజ్జనం తర్వాత పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.