ఈ నెల 21న విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది.

ఈ డిమాండ్‌ను ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షురాలు చెన్నపాటి మంజుల, ప్రధాన కార్యదర్శులు బసవలింగరావు మీడియా ముందు ఉంచారు. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సినిమాలకు ఉందని, అందుకే దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని వారు సూచించారు.

సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను చాలా ప్రతికూలంగా చూపించారని వారు ఆరోపించారు. ఇది కేవలం కల్పిత పాత్ర మాత్రమే కాదని, ఆ పాత్ర వెనుక ఉన్న పాఠశాల ఏపీలోని ఒక ప్రభుత్వ పాఠశాల అని వారు పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల పేరుతో ఈ సినిమాను రూపొందించారు. ఆ పాఠశాల విద్యార్థులు ధరించిన యూనిఫామ్, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ ఒక్కటేనని వారు గుర్తు చేశారు.

ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థను కించపరిచేలా ఉందని వారు అభిప్రాయపడ్డారు. తెరపై ఒక పాత్రను ఎలా చూపిస్తే, సమాజం ఆ పాత్రను అలాగే గుర్తుపెట్టుకుంటుందని వారు హెచ్చరించారు.