అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్’ పేరుతో కొత్త ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తూ, నగదును అక్రమంగా ఒక చోట నుండి మరో చోటికి మార్చే (మనీ లాండరింగ్) దేశాలను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి దూరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలతో ఇరాన్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెగ్గొట్టడమే ఈ ఆంక్షల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.

ఈ ఆంక్షల జాబితాలో ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రో కెమికల్ వ్యాపారాలతో సంబంధం ఉన్న 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలు ఉన్నాయి. ఇందులో భారత్‌కు చెందిన పోర్టీజ్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతీస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పీపీ సాఫ్ట్ టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్ ఉన్నారు.

అమెరికా చర్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలను ఎదుర్కోవడానికి తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ జాదేహ్ ప్రకటించారు. గతంలో కూడా అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమైందని, ఇరాన్ ప్రజలు, అధికారుల సంకల్పాన్ని పరీక్షించడంలో వాషింగ్టన్ మరోసారి ఓడిపోతుందని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అమెరికా ఆంక్షలను తమ వాణిజ్య భాగస్వాములు పట్టించుకోరని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌తో సంబంధాలను తెంచుకోవాలని అమెరికా ఒత్తిడి తెచ్చినా, తమ భాగస్వామ్య దేశాలు ఆ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోబోమని సందేశాలు పంపాయని ఆయన వెల్లడించారు. అమెరికా ప్రగల్భాలను ఎవరూ నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఇరాన్‌పై అమెరికా విధించిన ఈ ఆంక్షలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఇరాన్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న వారిని కూడా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారీ మూల్యం వసూలు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అమెరికా ఆంక్షల ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.