మష్రూమ్ హుమ్మస్ తయారు చేయడానికి ముందుగా తెల్ల నువ్వులను దోరగా వేయించుకోవాలి. వీటిని రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ (ఒక రకమైన నూనె) తో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక కప్పు కాబూలీ శనగలను శుభ్రంగా కడిగి, పది గంటల పాటు నానబెట్టాలి. వీటిని కుక్కర్‌లో తగినంత ఉప్పు, నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

ఉడికించిన శనగల్లోని నీటిని వంపేసి, వాటిని మిక్సీలో వేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల మిశ్రమం, పావు కప్పు నిమ్మరసం కలిపి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.

మరోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన మష్రూమ్స్, కొద్దిగా ఉప్పు వేసి సన్నని మంటపై వేయించాలి. అవి వేగుతున్నప్పుడు మరో టీస్పూన్ నూనె, చిటికెడు ఉప్పు జత చేసి మరికొంత సేపు వేయించి దించేయాలి.

చివరగా ఒక వెడల్పాటి గిన్నెలో గ్రైండ్ చేసిన శనగల మిశ్రమాన్ని సమానంగా పరచాలి. దానిపై ఉడికించిన శనగలు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, వేయించిన మష్రూమ్స్ వేసి మిరియాల పొడి, కారం చల్లుకోవాలి.

చివరిగా కొత్తిమీర తురుము, నిమ్మరసం చల్లుకుంటే రుచికరమైన మష్రూమ్ హుమ్మస్ తినడానికి సిద్ధమవుతుంది.