భారత మిక్స్‌డ్ డిజబిలిటీ పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన జట్టును ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు.

సిరీస్ ఆరంభంలో ఇంగ్లండ్ జట్టు 29 పరుగుల తేడాతో మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భారత్ పుంజుకుని ఆగస్టు 7న ఆరు పరుగుల తేడాతో, ఆగస్టు 9న ఎనిమిది పరుగుల తేడాతో వరుస విజయాలు సాధించింది. అయితే, ఆగస్టు 15, 16 తేదీల్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.

చివరి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 206 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి, 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మిక్స్‌డ్ డిజబిలిటీ క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

ఆటగాళ్లతో మాట్లాడిన అమిత్ షా, వారి కృషిని ప్రశంసించారు. దేశానికి గౌరవం తీసుకురావాలనే వారి పట్టుదల, సంకల్పం యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆటగాళ్లను ఆకాంక్షించారు.

ఈ విషయాన్ని అమిత్ షా తన ఎక్స్ (X) ఖాతా ద్వారా పంచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభకు ఈ సిరీస్ విజయం ఒక నిదర్శనంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.