సీనియర్ దర్శకుడు సాగర్ తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'అమ్మదొంగ' సినిమాతో నటి ఇంద్రజకు సినీ కెరీర్‌లో మంచి అవకాశం కల్పించానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'జగదేక వీరుడు' సినిమా షూటింగ్ సమయంలో ఇంద్రజ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది.

మైసూరులో షూటింగ్ ప్లాన్ చేసినప్పుడు, ఇంద్రజ ట్రైన్ ప్రయాణం తనకు పడదని, వాంతులు అవుతాయని చెప్పి ఫ్లైట్‌లో వస్తానని పట్టుబట్టింది. అప్పట్లో సొంత విమానం ఉన్న కే.ఆర్. విజయ వంటి స్టార్ నటీమణులు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ట్రైన్‌లో ప్రయాణించారని సాగర్ గుర్తు చేశారు. ఇంద్రజ ప్రవర్తన నచ్చని సాగర్, ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.

దీంతో షూటింగ్ సెట్‌లో వారం రోజుల పాటు ఇంద్రజతో ఎవరూ మాట్లాడకూడదని ఆయన యూనిట్ సభ్యులను ఆదేశించారు. ఎవరైనా మాట్లాడితే ఆమెకు వాంతులు అవుతాయని సరదాగా చెప్పడంతో, ఇంద్రజ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు కోరారు. ఆ ఘటన అనంతరం ఇంద్రజను తన సినిమాల్లోకి తీసుకోలేదని సాగర్ స్పష్టం చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్యలతో పనిచేసిన అనుభవాలను కూడా ఆయన పంచుకున్నారు. షూటింగ్ సమయాల్లో వీరిద్దరూ ఒకరినొకరు ఆటపట్టిస్తూ, “నేను రెడీ, వాడు రెడీనా?” అంటూ పోటాపోటీగా వాదించుకుంటూ దర్శకులను ఇబ్బంది పెట్టేవారని సాగర్ నవ్వుతూ వివరించారు.