తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి వంటి బ్రిడ్జ్-కమ్-బరాజ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దశాబ్దాలుగా దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వంటి చివరి దశ ప్రాజెక్టుల పనులు పూర్తయినా, నారాయణపేట, కొడంగల్‌కు నీళ్లు చేరే అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని హరీష్ రావు విమర్శించారు. కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదో ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక తన కేటాయింపు పరిమితులను దాటి అదనపు సాగు చేస్తున్నట్లు ఆరోపిస్తూ, తుంగభద్రపై అక్రమ నిర్మాణాలను తక్షణం ఆపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ, కెఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయాలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు.