వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తే, ప్రస్తుతం 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆయన విమర్శించారు. కరెంటు సరఫరాలో కోతలు ఉండటంతో రైతుల పొలాలు తడవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై శనివారం హాలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 400 మంది రైతులు, నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని, వ్యవసాయానికి 12 గంటల పాటు నిర్విరామంగా కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో నోముల భగత్ కుమార్ రాస్తారోకోను విరమించారు.

ఈ సందర్భంగా భగత్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాళేశ్వరం పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. గోదావరిలో నీరు ఉన్నప్పటికీ కరెంటు ఇవ్వకపోవడం వల్లే రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాశీకి వెళ్లి గంగా నదిలో పుణ్య స్నానం చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరుణ యాగంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు.

గోదావరి జలాలను మిగులు జలాల పేరుతో ఆంధ్రాకు అప్పనంగా ఇస్తున్నారని భగత్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తే తెలంగాణలో సగభాగం సస్యశ్యామలం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.