వరుణ్ తేజ్ నటించిన ‘కోరియన్ కనకరాజు’ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తన కెరీర్ ప్రయాణం, సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కథలను కేవలం ప్రేక్షకుడి కోణంలో వినేవాడినని, అప్పట్లో స్క్రిప్ట్‌లను లోతుగా విశ్లేషించే అలవాటు లేదని ఆయన చెప్పారు. కథలోని నిజాయితీ, భావోద్వేగం నచ్చితేనే ఆ సినిమాలకు ఓకే చెప్పేవాడినని ఆయన వివరించారు.

‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘కంచె’ వంటి సినిమాల గురించి వరుణ్ ప్రస్తావించారు. శేఖర్ కమ్ముల చెప్పిన కథలోని క్లైమాక్స్, ప్రేమకథల్లో హీరో హీరోయిన్ల పాత్రల బలం తనకు నచ్చాయని ఆయన అన్నారు. ‘తొలిప్రేమ’కు తమన్ సంగీతం, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ కలిసి రావడం పెద్ద బలం కాగా, ‘కంచె’ సినిమాను తండ్రి నాగబాబు విన్న తర్వాతే చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జార్జియాలో యుద్ధ సన్నివేశాలను వాస్తవికంగా చిత్రీకరించామని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రయోగాల విషయంలో కమల్ హాసన్, చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్నానని వరుణ్ తెలిపారు. అయితే ‘గని’ సినిమా విషయంలో కోవిడ్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం కావడం, అదే సమయంలో ఇతర పెద్ద స్పోర్ట్స్ సినిమాలు రావడం ఆ సినిమా ఫలితంపై ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’కు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని, మంచి ఆలోచనతో పాటు సరైన సమయంలో సినిమా విడుదల చేయడం ముఖ్యమని తాను గ్రహించానని చెప్పారు.

ప్రతి సినిమా తనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిందని వరుణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో ఏం చూడాలనుకుంటున్నారో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమైందని ఆయన తెలిపారు. ఇకపై కొత్త తరహా కథలతో పాటు ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేయాలని ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.