గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హైడ్రా (HYDRA - హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారులు కూల్చివేత పనులను ముమ్మరం చేశారు. కూలిన ఏడంతస్తుల భవనం పక్కనే ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు. ఈ పనుల కోసం బాహుబలి క్రేన్‌ను ఉపయోగిస్తున్నారు.
మూడు రోజుల క్రితం అంజయ్య నగర్‌లో 50 గజాల స్థలంలో నాలాపై నిర్మించిన ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఆ భవనం పక్కనే దెబ్బతిన్న మరో మూడు భవనాలను గుర్తించారు. వీటిని తొలగించే పనులను ఆదివారం ప్రారంభించగా, స్థానికుల విజ్ఞప్తి మేరకు అర్ధరాత్రి నిలిపివేసి సోమవారం ఉదయం తిరిగి మొదలుపెట్టారు.
చుట్టూ ఇతర నివాస భవనాలు ఉండటంతో, శిథిలాలు వాటిపై పడకుండా హైడ్రా అధికారులు జాగ్రత్తగా కూల్చివేతలు చేస్తున్నారు. ఈ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి పరిశీలించారు. స్థానికులు మరికొన్ని భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి అవసరమైతే తొలగిస్తామని కమిషనర్ ప్రకటించారు.
నాలాను ఆక్రమించి 50 గజాల స్థలంలో ఏడెనిమిది అంతస్తుల భవనాలు నిర్మించడం వల్లే భవనాల పటిష్టత దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని రంగనాథ్ తెలిపారు. కేవలం రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, ఆ మేరకే పునాదులు వేసి ఏడంతస్తుల వరకు నిర్మించడం భవనాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం అంజయ్య నగర్‌లో మరో భవనాన్ని కూల్చడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రమాదకరంగా ఉన్న మిగిలిన భవనాలపై కూడా అధికారులు నిఘా ఉంచారు.








