అమరావతా, ఆగస్ట్ 25: ఈసారి ఏపీ టెట్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 16 వరకు వివిధ షిఫ్టులు, పేపర్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని పేపర్లు సులభంగా ఉండగా, మరికొన్ని పేపర్లు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో ఒకే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు పేపర్‌ కాఠిన్యం ఆధారంగా మార్కుల తేడా ఏర్పడే అవకాశం ఉంది.

వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల కాఠిన్యం ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో పేపర్‌ సులభంగా, మరో షిఫ్ట్‌లో కఠినంగా ఉంటే అభ్యర్థుల ముడి మార్కులు (Raw Marks) నేరుగా పోల్చడం సమంజసం కాదు. అందుకే పేపర్‌ కాఠిన్యంలోని తేడాలను పరిగణనలోకి తీసుకుని స్కోర్లను సమతుల్యం చేసేందుకు నార్మలైజేషన్‌ విధానాన్ని ఉపయోగిస్తారు. అయితే ఏపీ టెట్‌ 2026లో నార్మలైజేషన్‌ ఏ విధానంలో, ఏ ప్రమాణాల ఆధారంగా చేపడతారనే దానిపై తుది స్పష్టత అధికారికంగా వెల్లడైన తర్వాతే వస్తుంది. కాబట్టి అభ్యర్థులు సోషల్‌ మీడియాలో వస్తున్న అంచనాలను అధికారిక ప్రకటనలుగా భావించకూడదు.

ఏపీ టెట్‌ మార్కులకు డీఎస్సీ నియామక ప్రక్రియలో వెయిటేజ్‌ ఉండటంతో నార్మలైజేషన్‌పై అభ్యర్థుల్లో మరింత ఆసక్తి నెలకొంది. టెట్‌ స్కోర్‌ తుది ర్యాంకు, ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఒకటి రెండు మార్కుల తేడా కూడా కీలకంగా మారవచ్చు. గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో సులభమైన ప్రశ్నపత్రాలు వచ్చిన సందర్భాలను ప్రస్తుత పరీక్షతో పోల్చుతూ కొందరు అభ్యర్థులు నార్మలైజేషన్‌పై వివిధ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గత టెట్‌ల మార్కులను ప్రస్తుత పరీక్షకు ఎలా వర్తింపజేస్తారు, గత పరీక్షల డేటాను నార్మలైజేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారా అనే అంశాలపై అధికారిక మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం అభ్యర్థుల్లో కొందరు నార్మలైజేషన్‌ ద్వారా 10 నుంచి 15 మార్కుల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరికొందరు ప్రస్తుత పరీక్షలోని షిఫ్టులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మార్కుల పెరుగుదల పరిమితంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే నార్మలైజేషన్‌లో ఖచ్చితంగా ఎన్ని మార్కులు పెరుగుతాయో ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. అభ్యర్థుల స్కోర్లు, ప్రతి షిఫ్ట్‌లో ప్రశ్నపత్రం కాఠిన్యం, హాజరైన వారి పనితీరు వంటి అంశాల ఆధారంగా అధికారికంగా నిర్ణయించిన విధానం ప్రకారమే తుది స్కోర్లు ఖరారవుతాయి. నార్మలైజేషన్‌ ద్వారా బోర్డర్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందా? ఎన్ని మార్కులు జోడిస్తారు? గత టెట్‌ పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటారా? వంటి ప్రశ్నలకు తుది సమాధానం ఫలితాలు, నార్మలైజేషన్‌ విధానం అధికారికంగా ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది.

అందువల్ల ప్రతి అభ్యర్థికి 10-15 మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి, బోర్డర్‌లో ఉన్న వారంతా పాస్‌ అవుతారు వంటి అంచనాలను అధికారిక సమాచారం వచ్చే వరకు నమ్మకపోవడం మంచిది. టెట్‌ ఫలితాలు, స్కోర్‌ నార్మలైజేషన్‌కు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను అభ్యర్థులు పరిశీలించాలి. కాగా టెట్ ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. సెప్టెంబరు 8న ఫైనల్ కీ విడుదల చేసి, సెప్టెంబరు 15న తుది ఫలితాలను వెల్లడిస్తారు.