బెంగళూరు వేదికగా వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అన్షుల్ కాంబోజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నార్త్ జోన్ జట్టు 165 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అన్షుల్ క్రీజులోకి వచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడే అన్షుల్, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 52 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో వన్డే ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేసి వెస్ట్ జోన్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

తుషార్ దేశ్‌పాండే, తనుష్ కొటియాన్ వంటి స్టార్ బౌలర్లను సైతం అన్షుల్ వదలకుండా ఎదుర్కొన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో నార్త్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 251 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేయగలిగింది.

నార్త్ జోన్ జట్టులో అన్షుల్‌తో పాటు ఆయుష్ బదోని 51 పరుగులు, ఆయుష్ దోసేజా 42 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలం కాగా, వెస్ట్ జోన్ బౌలర్లలో తనీష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.

మొదటి రోజు ఆటలో అన్షుల్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన అన్షుల్, బౌలింగ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.