ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు, మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారాలన్నింటినీ ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, ఆధారాలతో సహా నిజాలను ప్రజల ముందు ఉంచుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి వివరించారు. కొత్తగా ఒక్క అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఉన్న జాబితానే సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారనే ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన రీసర్వేలో భాగంగా ఇప్పటికే 276 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు.

భూముల మార్కెట్ విలువల సవరణతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడించారు. గతేడాది రూ.15 వేల కోట్లుగా ఉన్న ఆదాయం, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కొల్లూరు డబుల్ బెడ్‌రూం ఇళ్ల మరమ్మతులను కూడా ప్రభుత్వం చేపడుతుందని ఆయన తెలిపారు.