చిలకలూరిపేట కేబీ రోడ్డులో ఉన్న గాంధీ పార్కు ఒకప్పుడు పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, వాటర్ ఫౌంటెన్‌తో కళకళలాడేది. ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులతో సందడిగా ఉండే ఈ పార్కులో, అప్పట్లో ఏర్పాటు చేసిన భారీ సైరన్ సమయాన్ని తెలియజేస్తూ పట్టణ ప్రజలకు దిక్సూచిగా నిలిచేది. నాగేంద్రస్వామి పుట్ట వద్ద పూజలు, శుభకార్యాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉండేది.

అయితే, కాలక్రమేణా ఈ పార్కు తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పార్కు ప్రవేశ ద్వారం వద్ద పేరు కూడా కనిపించడం లేదు, గాంధీ విగ్రహం అదృశ్యమైంది. వాకింగ్ ట్రాక్ శిథిలమవ్వడం, ఆట పరికరాలు విరిగిపోవడం, బెంచీలు ధ్వంసం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులోని కొంత భాగాన్ని శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంగా మార్చడంతో అందుబాటులో ఉన్న స్థలం కూడా తగ్గిపోయింది.

ఈ దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కును తిరిగి అందంగా తీర్చిదిద్దాలని, గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. పార్కు నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించి, పచ్చదనాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ విషయమై మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం స్పందిస్తూ, అమృత్ పథకం కింద గాంధీ పార్కును ఆధునీకరించే ప్రతిపాదన ఉందని తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.