ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే బీసీలకు నిజమైన రాజకీయ, ఆర్థిక సాధికారత లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే, వాటిని బీసీలపై కక్షగా వైసీపీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని, ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆధారాలతోనే ఆ చర్యలు తీసుకుందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి అక్రమంగా నిధులు చేరడం వల్లే ఈ అరెస్టు జరిగిందని, దీనిని బీసీలకు ఆపాదించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. మద్యం కేసుల్లో జోగి రమేశ్ అరెస్టును కూడా రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు, లోకేశ్‌లకు ముడిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో తమపై జరిగిన దమనకాండను ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. గతంలో తనపై హత్యాయత్నం కేసు, కొల్లు రవీంద్రపై హత్య కేసు, అయ్యన్నపాత్రుడిపై అత్యాచారం కేసు, యనమల రామకృష్ణుడుపై అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఒక్క పైసా అవినీతికి ఆధారాలు లేకపోయినా, తనను 80 రోజులు జైలులో ఉంచారని ఆయన గుర్తుచేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు గతంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 2019లో వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని, దీనివల్ల 16 వేల పదవులను బీసీలు కోల్పోయారని అచ్చెన్నాయుడు వివరించారు. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు అన్యాయం చేసింది వైసీపీనేనని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 1994-95 నాటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
బీసీల హక్కుల కోసం హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులోనూ చివరి వరకు పోరాడతామని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. ఈ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులకు ఎలాంటి భంగం కలిగించవని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాకే బీసీల గురించి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.








