మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరంలో అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సుమ కనకాల, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత హీరో వరుణ్ తేజ్, సంగీత దర్శకుడు ఎస్. థమన్ కలిసి సుమకు శాలువా కప్పి, భారీ గజమాలతో సత్కరించారు.
తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా వందలాది ప్రీ రిలీజ్ ఈవెంట్లను, టీవీ షోలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ఈ సన్మానం చేశారు. అనూహ్యంగా గజమాలతో సత్కరించడంతో సుమ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన హాస్య చతురతను ప్రదర్శిస్తూ, "కేవలం శాలువాలేనా, గిఫ్ట్ ఏదైనా ఉందా?" అని సరదాగా ప్రశ్నించి అందరినీ నవ్వించారు.
సన్మానం అనంతరం సుమ మాట్లాడుతూ, ఇది తనకు జీవిత సాఫల్య పురస్కారంలా అనిపిస్తోందని పేర్కొన్నారు. "నెక్స్ట్ టైం గజమాలతో ప్లాన్ చేస్తే పువ్వులకు బదులు పుదీనాతో చేయించండి, ఇంట్లో చట్నీకి పనికొస్తుంది" అని ఆమె చేసిన వ్యాఖ్యలు వేదికపై నవ్వులు పూయించాయి. ఇప్పటికే వేడికి ఇబ్బంది పడుతుంటే మూడు శాలువాలు కప్పారని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.
భీమవరంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సుమ గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం భీమవరంలోని మావుళ్లమ్మ జాతరలో తనకు సన్మానం జరిగిందని, మళ్లీ ఇన్నేళ్లకు అదే ప్రాంతంలో సత్కారం పొందడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆమె భావోద్వేగంతో తెలిపారు.








