భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ డివిజన్‌లో గోదావరి వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నది ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని తెలంగాణ రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు పున్నంచంద్ శనివారం వెల్లడించారు.

వరద తాకిడికి దెబ్బతిన్న పంటల్లో 2,400 ఎకరాల పత్తి, 1,400 ఎకరాల వరి, 800 ఎకరాల జామాయిల్ ఉన్నాయి. మిగిలిన 400 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. వర్షాల ప్రారంభం నుంచే రైతులు రెండు, మూడుసార్లు విత్తనాలు వేసి ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని, తాజాగా గోదావరి వరదలు వారిని మరింత ఆందోళనకు గురిచేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వరి సాగు కోసం ఎకరాకు రూ. 40 వేల నుండి రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పున్నంచంద్ కోరారు. బాధితులకు తగిన పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.